జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్..! సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి ?

ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి, వీరిలో కొందరని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనిపై ఈ మధ్యే జగన్ కూడా స్పందించారు.

అరెస్టుకు భయపడేది లేదని, తాను విజయవాడలోనే ఉన్నానని జగన్ ఇప్పటికే చెప్పేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ ను అరెస్టు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులకు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే తిరుపతి వెళ్లిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంలో జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో వారికి వెల్లడించినట్లు సమాచారం.

విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో పంచుకున్న సమాచారం ప్రకారం లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ ను సీఐడీ వచ్చే నెల 10వ తేదీ లోపు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుస్తోంది. అయితే సాయిరెడ్డి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. తనను కెలకొద్దని మాత్రం ఇప్పటికే వైసీపీలో జగన్ కోటరీగా ఆరోపిస్తున్న వారికి హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత వైసీపీ కూడా సైలెంట్ గా ఉంటోంది. అయితే సాయిరెడ్డి చెప్పిన సమాచారం నిజమే అయితే మాత్రం జగన్ విషయంలో కూటమి తీసుకునే నిర్ణయం, దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై చర్చ జరుగుతోంది.

మరోవైపు ఇప్పటికే ఓసారి మద్యం స్కాంలో సాక్షిగా హాజరై సీఐడీ సిట్ కు పలు వివరాలు వెల్లడించిన సాయిరెడ్డి.. ఇప్పుడు ఈ స్కాంలో జగన్ అరెస్టుపై చెప్పారని భావిస్తున్న రహస్య సమాచారంపై వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు. సాయిరెడ్డి వంటి కూటమికి అమ్ముడుపోయిన రోగ్ ఎంపీ చెప్పే మాటలకు విలువేముంటుందని జగన్ స్వయంగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!