తెలంగాణ బీజేపీలో భిన్న స్వరాలు, అంతర్గత పోటీలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీ లోపలే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఈటల తీవ్రస్థాయిలో ఆరోపించారు. “బీ కేర్‌ఫుల్ కొడకా… నేను శత్రువుతో పోరాడతా, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను” అంటూ ఎవరైనా తనను టార్గెట్ చేస్తే సహించేది లేదన్న స్పష్టం చేశారు.
ఈటల వ్యాఖ్యలు చూస్తే, తనను పార్టీ నుంచి బయటకు నెట్టి వేయాలనే కుట్రలు సాగుతున్నట్లు అర్థమవుతోంది. మునుపు రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన విధానాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడు అదే పంథాలో ఈటలపై చర్యలు తీసుకునే కుట్రలు నడుస్తున్నాయని భావిస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
కరీంనగర్ బీజేపీలో గందరగోళ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్న వైనం కనిపిస్తోంది. ఈటల ప్రజా మద్దతుతో కూడిన నేత. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేయడం పార్టీకి మైనస్ కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తనపై జరుగుతున్న కుట్రల గురించి కేంద్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తానని ఈటల హెచ్చరించడాన్ని లైట్‌గా తీసుకోవడానికి వీల్లేదు. ఇది బీజేపీలో ఓ పెద్ద విభేదానికి నాంది కావచ్చు. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
తెలంగాణ బీజేపీలో నాయకత్వ పోటీ, పరస్పర అసూయలు పార్టీ భవిష్యత్తుపై మబ్బులా కమ్ముకున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించకపోతే, బీజేపీ పునాదులు బలహీనపడే అవకాశం ఉంది.