ట్రాఫిక్‌ డీసీపీ డ్రంకెన్‌ డ్యూటీ ! కార్యాలయంలోనే మద్యపానం, వాంతులు

హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారిన అధికారి ప్రవర్తన

విషయం బయటికి రావడంతో అంతర్గత విచారణకు ఆదేశం

మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెట్టి బుద్ధి చెప్పాల్సిన ఓ ట్రాఫిక్‌ డీసీపీ డ్రంకెన్‌ డ్యూటీ చేస్తున్నారు. అర్థం కాలేదా..? విధి నిర్వహణలో ఉన్నప్పుడే మద్యం తాగేస్తున్నారు. అది కూడా తన అధికారిక కార్యాలయంలోనే పెగ్గు మీద పెగ్గు కొట్టేస్తున్నారు. ఇలా పూటుగా మద్యం తాగి తన కార్యాలయంలోనే వాంతులు చేసుకోవడంతో హైదరాబాద్‌లోని అతి పెద్ద కమిషనరేట్‌లో ఉన్నతాధికారిగా ఉన్న సదరు ట్రాఫిక్‌ డీసీపీ బాగోతం బయటకు పొక్కింది. సదరు అధికారి వారం క్రితం తన కార్యాలయంలో మద్యం తాగి వాంతులు చేసుకోగా దానిని శుభ్రం చేసేందుకు కింది స్థాయి సిబ్బంది నానావస్థలు పడ్డారట. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

డీసీపీ స్థాయి అధికారి ఇలా ప్రవర్తించడం ఏంటని ? పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సదరు డీసీపీ తీరుపై కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపక్క, విషయం సోషల్‌ మీడియాకు ఎక్కడంతో అప్రమత్తమైన అధికారులు సదరు ట్రాఫిక్‌ డీసీపీపై అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కాగా, సదరు డీసీపీ కార్యాలయంలోనే మద్యం సేవిస్తున్నాడని ఉన్నతాధికారులకు గతంలోని కొందరు మౌఖికంగా ఫిర్యాదులు చేసినట్టు సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!