హైదరాబాద్: టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులైంది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్.. జనరల్ కౌన్సిల్ లో చర్చించిన పిదప కార్మిక నేతలు ఇవాళ్టి చర్చల్లో పాల్గొంటున్నారు. అటు, ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఈ అంశం మీద వరుస భేటీలు జరుపుతున్నారు.
ఇంతకుముందు, నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్ లో రెండు కండిషన్స్ దగ్గర చర్చలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 1) ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్, 2) సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షిట్. ఈ రెండు ప్రతిపాదనల దగ్గరే ఇరువర్గాల మధ్య పీఠముడి నెలకొంది.
నిర్మాతలు అర్ధం లేని ప్రతిపాదనలు చేస్తూ కావాలనే కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్.. ఈ మూడు విభాగాలకు వేతనాలు పెంచకపోవడం పై ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, నిర్మాతలు తాము ఎవరికి వ్యతిరేకం కాదంటున్నారు. కార్మికులు ప్రస్తుతం తమ పరిస్థితులు అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే చర్చలు ఏమేరకు ఫలప్రదం అవుతాయో చూడాలి..