తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో వాతావరణ కేంద్రం ఇప్పటికే జులై 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కురుస్తున్న భారీవానలతో తెలంగాన వ్యాప్తంగా పలు చోట్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో వానలతో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పతుంది.
రోడ్లన్ని కూడా నీటి కుంటలుగా మారిపోయాయి. నాళాలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయిపోయాయి. పలు ప్రాంతాలలో.. వర్షాల వల్ల నడుము లోతు వరకు వరద నీళ్లు వచ్చేశాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ లో తెలంగాణ అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా అధికారులు 24/7 పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొవాలన్నారు. ప్రజలకు సాయం చేయడానికి అధికారులు జిల్లాల్లోనే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా వంటి విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలన్నారు. వైద్యశాఖాధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు. వాతావరణ శాఖ అలర్ట్ ఆధారంగా ముందస్తు హెచ్చరికల్ని జారీ చేస్తు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమున్న చోట టోల్ ఫ్రీనెంబర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటూ నిరంతరం అలర్ట్ గా ఉండాలన్నారు.