వాన.. వాన.. లేదప్పా?..ఈ నెలలో ఇప్పటివరకు 30 శాతం లోటు వర్షపాతం

అనేక ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలు….వర్షాకాలంలో మండుతున్న ఎండలు

రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత…

నైరుతి రుతుపవనాల మందగమనం..గాలులు బలహీనంగా వీస్తుండడంతో పెరిగిన ఎండలు

మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం…అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలిక

అమరావతి: ఆకాశమంతా మబ్బులు.. నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. కాదంటే జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇది వానాకాలమా..? లేక ఎండాకాలమా? అనే అనుమానం వస్తోంది. రాష్ట్రంలోకి ఎప్పుడో వచి్చన రుతు పవనాలు ఎటుపోయాయి అనే సందేహం కలుగుతోంది. ఆ స్థాయిలో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. విస్తృతంగా వర్షాలు కురవాల్సిన సమయంలో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నెల్లూరు జిల్లా కావలి, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఎండ 40 డిగ్రీలు దాటింది. పల్నాడు జిల్లా జంగ మహేశ్వరపురంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నర్సాపురంలో 39.4, కావలి: 39.1, నెల్లూరు: 39, విజయవాడ: 38.5, తిరుపతిలో 36 డిగ్రీలుంది. ఇంకా అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయట తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు కూడా ఉక్కపోత ఉంటోందని వాపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 28 కంటే ఎక్కువగా ఉంటున్నాయి.. ఇది సాధారణం కంటే 2, 3 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం.

ఈ సీజన్‌లో తక్కువ వర్షపాతం
నిజానికి ఈ సంవత్సరం వర్షాకాలం ముందుగానే ప్రారంభమైంది. వేసవిలోనే వానలు కురిశాయి. కానీ, ఇప్పుడు వర్షాలే లేవు. జూన్‌ నెలలో సగటున 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 7.0 సెం.మీ. మాత్రమే పడింది. ఈ నెలలో ఇప్పటిదాక 30 శాతం లోటు వర్షపాతం ఉంది. దీంతో వాతావరణం వేడెక్కి ప్రజలు ఇబ్బందులు పడడంతో పాటు వ్యవసాయ పరిస్థితులు నిరాశజనకంగా మారాయి. వర్షాలు లేక అనేక ప్రాంతాల్లో రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే వేసిన పంటలు నీరు లేక ఎండిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.

⇒ నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించినా వాటి కదలికలు బలహీనంగా ఉండ డం, తేమ గాలులు లేకపోవడంతో ఎండ తీవ్రత పెరిగినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి గాలులు బలంగా లేకపోవడం, బంగాళాఖాతంలో ఆవర్తనాలు, అల్పపీడనం ఏర్పడకపోవడంతో వాటికి అనుకూల పరిస్థితి లేకుండాపోయింది. ఈ నెల మూడో వారం నుంచి కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 17వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతోంది. తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో నైరుతి రుతుపవనాలు బలపడి వర్షాలు కురుస్తాయని భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!