ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ సాక్ష్యం…

రేపు ఏసీపీ ఎదుట మహేశ్ గౌడ్ వాంగ్మూలం

2023 ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

పోలీసుల అభ్యర్థన మేరకు హాజరుకానున్న మహేశ్ గౌడ్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారుల అభ్యర్థన మేరకు మహేశ్ కుమార్ గౌడ్ రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అధికారుల ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు.

2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో, ఆయన ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మహేశ్ కుమార్ గౌడ్ వాంగ్మూలాన్ని అత్యంత కీలకమైనదిగా దర్యాప్తు సంస్థలు పరిగణిస్తున్నాయి.

ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చే వివరాలు ఈ కేసులో దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించడానికి దోహదపడతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆయన ఈ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇప్పటికే పలువురు అనుమానితులను, ఇతర బాధితులను పోలీసులు విచారించి, వారి నుంచి కూడా వివరాలు సేకరించిన విషయం విదితమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!