ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. అనేక మలుపులు.. రోజుకో కొత్త విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. 2023 నవంబర్‌లో ట్యాప్ చేసిన సమాచారం తప్ప.. మిగిలిన డేటాను మొత్తం ధ్వంసం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో 2023 నవంబర్‌లో ట్యాపింగ్‌కు గురైన నెంబర్లు ఉన్న వారిని మాత్రమే సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేసి సాక్షిగా పెడుతున్నారు దర్యాప్తు అధికారులు. ఇదిలా ఉండగా.. తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే పని చేశానని ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదో రోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు. విచారణలో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఐదు రోజులు.. గంటల పాటు విచారణ జరిపినప్పటికీ చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తు లేదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో రిలీఫ్ ఉండడం వల్లనే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న రిలీఫ్‌పై ఆగస్టు 4న కౌంటర్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది.

పోలీస్ ఆఫీసర్ కావడంతో సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు చాలా తెలివిగా సమాధానాలు చెపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అధికారి, ప్రిన్సిపల్ సెక్రెటరీలను కూడా సిట్ విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరూ తనకు తెలియదని.. అప్పటి డీజీపీ ఆదేశిస్తేనే ఫోన్‌ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు ప్రభాకర్ రావు. ఈ క్రమంలో మాజీ డీజీపీని కూడా త్వరలో విచారించి.. స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్లు ఆధారాలు సేకరించింది సిట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!