12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు సోమవారం బాధితులు ఫిర్యాదు చేశారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నారు. సెక్షన్ 498 కేసులు ఎదుర్కొంటున్న పురుషులు వీరు చేసిన మోసాలకు బలవుతున్నారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి వివాహం వరకు తీసుకువెళతారు.
ఈ లోపు వారి నుండి అందినకాడికి డబ్బును దోచుకుంటారు. బాధితులు తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధించేవారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారు.
ఇటీవల నిత్య పెళ్ళి కూతురు బేతి వీర దుర్గా నీలిమపై కేసులు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సోమవారం నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగ మరి ఎవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసామన్నారు. నిత్య పెళ్లికూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.