గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బైపోల్‌లో పోటీపై గులాబీ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. అయితే ఎమ్మెల్యే టికెట్ మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తున్న వేళ.. రేసులోకి మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రనాథ్‌తో పాటు.. మాగంటి గోపినాథ్ మొదటి భార్య కొడుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వాలని అమెరికాలో ఉన్న మాగంటి కుమారుడు గులాబీ లీడర్లకు టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అటు వజ్రనాథ్‌కు కూడా జూబ్లీహిల్స్ పై మంచి పట్టు ఉండటంతో.. తాను రేసులో ఉన్నానంటూ కేడర్‌కు ఆయన డైరెక్షన్ ఇస్తున్నట్టు సమాచారం. దాంతో ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు టికెట్ కోసం వెయిటింగ్‌లో ఉండటంతో.. బీఆర్‌ఎస్ హైకమాండ్.. ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభలో మాగంటి గోపినాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.. జూబ్లీహిల్స్ టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానిదే అన్నారు. తాను జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు.. మాగంటి గోపినాథ్ బ్రతికి ఉన్న సమయంలో నియోజకవర్గంపై వజ్రనాథ్‌కు మంచి పట్టుంది. నియోజకవర్గంలో పోల్ మేనేజ్‌మెంట్ అంతా వజ్రనాథ్ చూసేవారట. ప్రతి డివిజన్‌లోనూ ఆయనకు భారీ అనుచరగణం ఉంది. ప్రస్తుతం మాగంటి ఫ్యామిలీ నుంచి మొదటి భార్య కొడుకు టికెట్ ఆశిస్తుండటం. హైకమాండ్ గోపినాథ్ భార్యకు టికెట్ ఇస్తే.. ఫ్యామిలీ పరువు బజారున పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే తనకు టికెట్ టికెట్ ఇవ్వాలని వజ్రనాథ్ గులాబీ హైకమాండ్‌కు సందేశం పంపినట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది. అంతకుముందు 2014 టీడీపీ తరుపున 2018లో టీఆర్ఎస్ తరుపున ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. దాంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీకి అడ్డగా మారింది. కానీ ఆయన తర్వాత.. బీఆర్‌ఎస్‌లో అలాంటి స్ట్రాంగ్‌లీడర్ లేకుండా పోయారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో మాత్రం జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కొడుకు విష్ణువర్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి అయిన మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. దాంతో ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మాగంటి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వని పక్షంలో తన పేరును పరిశీలించాలని హైకమాండ్‌ను ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న వారిలో రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మాగంటి ఫ్యామిలీ టికెట్ ఇవ్వకపోతే.. తన పేరును పరిశీలించాలని గులాబీ హైకమాండ్‌ను కోరుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రావుల శ్రీధర్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో మంచి పట్టుంది. గత శాసనసబ ఎన్నికల సమయంలోనూ జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. కానీ బీఆర్‌ఎస్ హైకమాండ్ మాగంటి గోపికే టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత ఓసారి రావుల శ్రీధర్ రెడ్డికి మాగంటి గోపినాథ్ అప్పట్లో స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చినట్టు సమాచారం. అప్పట్లో ఇద్దరు నేతలకు సర్ధి చెప్పడంతో.. సైలెంట్ అయ్యారు. మొత్తానికి జూబ్లీహిల్స్ టికెట్ పంచాయితీ బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.