ప్రసవానంతర డిప్రెషన్ (PPD) కారణంగానే ఈ విషాదమన్న పోలీసులు
కర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వాన్ని కదిలించే అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 38 రోజుల పసికందు హత్య కేసులో వెలుగుచూస్తున్న వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (PPD) మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఒక తల్లి తన 38 రోజుల పసికందును మరిగించిన నీటిలో వేసి దారుణంగా చంపిందని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంతే కాకుండా ప్రసవానంతర డిప్రెషన్ తీవ్రత, దాని పట్ల అవగాహన లేమిపై తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సంఘటన భార్యాభర్తల సంబంధాలు, కుటుంబ మద్దతు మరియు మానసిక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది.
ప్రసవానంతర డిప్రెషన్, ఆర్థిక కష్టాలు – భర్త నిర్లక్ష్యం పసికందు ప్రాణం తీసిందా?:
నెలమంగళ శివార్లలోని విశ్వేశ్వరపుర ప్రాంతంలో నివసిస్తున్న 25 ఏళ్ల రాధా మణి, తన భర్త పవన్ నిరుద్యోగిగా ఉండటం, తనను ఒంటరిగా వదిలేయడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని పోలీసులు వెల్లడించారు. ఈ నిరాశ మరియు ఆర్థిక భారం ఆమెలో ప్రసవానంతర డిప్రెషన్‌ను మరింత తీవ్రతరం చేశాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. పసికందు పుట్టినప్పటి నుండి సరిగ్గా పాలు తాగకపోవడం, నిరంతరం ఏడవడం వంటివి రాధాకు మరింత మానసిక క్షోభను కలిగించాయని పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, రాధా థైరాయిడ్ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఇటు శారీరక సమస్యలు, అటు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు భర్త నుండి తగిన మద్దతు లభించకపోవడం వంటి కారణాలతో ఆమె తీవ్ర నిరాశలోకి జారిపోయింది. పవన్ పెయింటర్‌గా పనిచేసేవాడని, అయితే ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడని సమాచారం. ఈ నిరుద్యోగం వల్ల కుటుంబానికి ఆదాయం లేకపోవడం, ఇంటి ఖర్చులు, బిడ్డ సంరక్షణ భారం మొత్తం రాధాపై పడి ఉండవచ్చు. పుట్టింటిలో ఉంటున్న రాధా ప్రసవించినా.. బిడ్డను చూసేందుకు భర్త పవన్ రాకపోవడం ఆమెను మరింత కుంగుదీసి ఉండవచ్చనే అభిప్రాయం వెళ్లడించారు.
భర్త నిర్లక్ష్యం – ఒక కారణమా?
పోలీసులు పేర్కొన్నట్లు “తనను ఒంటరిగా వదిలేయడం” అనే అంశం ఇక్కడ కీలకం. ప్రసవానంతర కాలంలో ఒక తల్లికి శారీరక, మానసిక మద్దతు అత్యవసరం. నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, కొత్త బాధ్యతల ఒత్తిడి ఆమెను కుంగదీస్తాయి. ఈ సమయంలో భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు, ఇంటి పనులలో సహాయం, బిడ్డ సంరక్షణలో భాగస్వామ్యం చాలా కీలకం. భాగస్వామి నిరుద్యోగిగా ఉండటం వల్ల ఆర్థిక భారం పెరగడంతో పాటు, బిడ్డను చూసుకోవడంలో సహాయం చేయకపోవడం, లేదా ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోకపోవడం వంటివి ఆమె డిప్రెషన్‌ను మరింత పెంచి ఉండవచ్చు.
అయితే, నేరం చేసిన వ్యక్తి రాధా మణి అనే వాస్తవం మారదు. మానసిక సమస్యలు ఉన్నప్పటికీ, ఒక పసికందు ప్రాణం తీయడం అత్యంత దారుణమైన చర్య. అయినప్పటికీ, ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడం, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా నివారించడానికి అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ఇక్కడ రాధా నేరాన్ని కాకుండా.. ఆమె ఎదుర్కొంటున్న మానసిక స్థితిని గుర్తించాలి. ఆమె చేసింది నేరమే కానీ ఆమెకు సరైన మద్దతు లభించి ఉంటే ఆ నేరం చేసే అవకాశం ఉండేది కాదు.
ప్రసవానంతర డిప్రెషన్ (PPD)కు మద్దతు ఆవశ్యకత:
ఈ కేసు మరోసారి ప్రసవానంతర డిప్రెషన్ ఎంత తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యో వెల్లడి చేసింది. సరైన సమయంలో గుర్తించి, చికిత్స అందించకపోతే ఇది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. భారతదేశంలో PPDతో బాధపడుతున్న తల్లుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ఈ తల్లులకు కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా భర్త నుండి తగిన మద్దతు లభించకపోతే, పరిస్థితి మరింత దిగజారవచ్చు.
బెంగళూరు ఘటన కేవలం ఒక నేరం మాత్రమే కాదు, ఇది సమాజానికి ఒక హెచ్చరిక. ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్న తల్లులకు మానసిక, శారీరక, ఆర్థిక మద్దతు ఎంత అవసరమో ఈ సంఘటన తెలియజేస్తుంది. భర్తలు తమ భాగస్వామికి అండగా నిలవడం, వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా ఇటువంటి విషాదాలను నివారించవచ్చు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అవుతుండగా, మానసిక ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది.
38 రోజుల పసికందును వేడి నీటిలో మరిగించి చంపిన కన్నతల్లి
