- న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు వివాహిత ఆందోళన
- ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం,వెంటనే ఆసుపత్రికి తరలింపు
బాధితురాలిపై కేసు నమోదు
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ఓ వివాహిత తన ప్రియుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టి, అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
వివరాల్లోకి వెళితే.. నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన మహిళకు రామచంద్రాపురానికి చెందిన వ్యక్తితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, మనస్పర్థల కారణంగా వివాహం జరిగిన ఏడాది నుంచే ఇరువురు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏడేళ్ల క్రితం కొమరబండకు చెందిన యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు సహజీవనం చేస్తున్నారు.
ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆ యువకుడిపై ఆమె ఒత్తిడి చేసింది. అందుకు అతడు నిరాకరించడంతో గత రెండు రోజులుగా అతడి ఇంటి ముందు వివాహిత ఆందోళన చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెకు మద్దతుగా నిన్న యువకుడి ఇంటి ముందు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, వెంటనే సీఐ రజితారెడ్డి ఆమెను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత ఏడేళ్లుగా తాము కలిసి ఉంటున్నామని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసుల వద్ద మొరపెట్టుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన కారణంగా వివాహితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.