హీటెక్కిన ఓల్డ్ సిటీ…..మాధవి లత vs రాజాసింగ్

బీజేపీ నుంచి గోషామహల్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు రాజాసింగ్. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. మొన్నటి ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలో రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి కరుడు గట్టిన హిందుత్వవాదిని బీజేపీ అధిష్టానం దూరం పెట్టింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ పెద్దలు ఆయన ఎపిసోడ్ పై మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అయినా తాజాగా రాజాసింగ్ పై అదే పార్టీ నేత మాధవీలతతీవ్ర విమర్శలు చేశారు. అదే ఇప్పుడు రాష్ట్ర నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. అసలు మాధవీలత లెక్కలేంటి?

రాజాసింగ్ పై తీవ్ర విమర్శలు చేసిన మాధవీలత

ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అదే పార్టీ బీజేపీకి చెందిన నేత మాధవీలత తీవ్ర విమర్శలు చేశారు. రాజాసింగ్ కి బీజేపీ మద్దతు లేకుండా ఎమ్మెల్యే ఛాన్స్ వచ్చిందా? అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. కార్పొరేటర్ స్థాయిలో ఉన్న రాజాను ఎమ్మెల్యేగా చేసింది బీజేపీనే అని స్పష్టం చేశారు. రాజాసింగ్ బీజేపీ గురించి విమర్శలు చేయడం సరికాదని మాధవీలత పేర్కొన్నారు. పార్టీలో ఎదిగిన నాయకుడిగా ఆయనకు నైతిక బాధ్యత ఉందన్నారు. ఇతర మతాల వారిపై వ్యాఖ్యలు చేయడమే హిందుత్వమా? అని రాజాసింగ్ పై ఆమె మండిపడ్డారు.

ఎంపీగా పోటీ చేసినప్పుడు రాజాసింగ్ సహకరించలేదని ఆరోపణలు

తాను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు రాజాసింగ్ తనకు సహకరించలేదని మాధవీలత ఆరోపించారు. తన గురించి మగాళ్లే దొరకలేదా? అంటూ హేళనగా మాట్లాడారన్నారు. ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమని, మహిళలను చిన్నచూపు చూపు చూడంట సరైందికాదని ఫైర్ అయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు రాజాసింగ్ కంటే తానే ఎక్కువ ఓట్లు సాధించినట్లు మాధవీలత చెప్పుకొచ్చారు. దాని ఆధారంగా తన ప్రజాదరణను నిరూపించుకున్నానని, పార్టీకి తాను బలమైన నేతనని, వెనకబడిన నాయకురాలు కాదని చెప్పుకొచ్చారు.

గోషామహల్లో తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటున్న మాధవీలత

గోషామహల్ నియోజకవర్గానికి తానే బెటర్ అభ్యర్ధినని హైకమాండ్ భావిస్తోందని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే గోషామహల్ కు ఉపఎన్నిక అనివార్యమవుతోంది. అలాగే జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ఎదురుచూస్తోంది. మాధవీల జూబ్లీ హిల్స్ పై కన్నెసినట్టు కనిపిస్తున్నారు. అందుకే గోషామహల్, జూబ్లీహిల్స్ ఎక్కడైనా పోటీకి సిద్ధమని కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు.

అసదుద్దీన్ చేతిలో ఓటమి పాలైన మాధవీలత

2024 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభస్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాధవీ లత బరిలో నిలవగా, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ చేతిలో మాధవీలత ఓటమి పాలయ్యారు. ఆ క్రమంలో మాధవీలత చట్టసభల్లో అడుగుపెట్టాలన్న తాపత్రయంతో రాజాసింగ్ ను టార్గెట్ చేస్తూ హైకమాండ్ గుడ్ లుక్స్ లో పడటానికి తాపత్రయపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే మాధవీలత తాజా దూకుడు ఆమెకే బూమరాంగ్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

చల్లారిన మంటలను తిరిగి రాజేస్తున్నారని మండిపాటు

మాధవీలత తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారంట. రాజసింగ్ రాజీనామాపై మాధవీలత చేస్తున్న రచ్చతో.. చల్లారిన మంటలపై మళ్ళీ నిప్పులు పోయడానికి చూస్తున్నారని మండిపడుతున్నారు. రాజాసింగ్ ఏపిసోడ్ లో ఎవరూ నోరు జారొద్దని పార్టీ ఇప్పటికే పార్టీ వార్నింగ్ ఇచ్చింది. కానీ పార్టీ నిర్ణయాన్ని కాదని కామెంట్స్ చేయడం ఏంటని మాధవీలత తీరుపై నేతలు మండిపడుతున్నారు. రాజసింగ్ పై అనవసర కామెంట్స్ చేస్తున్న మాధవీ లతపై రాష్ట్ర నేతల సీరియస్ గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ లైన్ దాటితే రాజసింగ్ కి పట్టిన గతే మాధవీలత కు పడుతుందనే హెచ్చరికలు అధిష్టానం నుంచి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మాధవీలత కామెంట్స్ పై సీనియస్ గా ఉన్న రాష్ట్ర నేతలు

రాజాసింగ్ వర్సెస్ మాధవీలత వివాదం రాష్ట్ర బీజేపీని కుదిపేస్తోంది. అయినా రాజాసింగ్ అంశంలో బడా నేతలే సైలెంట్ మూడ్ లో ఉంటే మాధవీలతకు మాత్రం విమర్శలు చేసేంత అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న పార్టీ నేతల్లో వస్తుందట. రాజసింగ్ పై విమర్శలు చేస్తే ఇంకాస్త ఫేమస్ అవుతానని అనుకున్నారేమో కానీ……… ఆమె తన వ్యాఖ్యలతో పార్టీలో పాత, కొత్త నేతల పంచాయితీ కుంపటి మళ్లీ రాజేసారనే చర్చ బీజేపీలో జరుగుతుంది.. రాజాసింగ్ ఔట్ తో గోషామహల్ అసెంబ్లీ స్థానానికి తనకు లైన్ క్లియర్ అయిందనే భావనలో మాధవీలత ఉన్నట్లు కనిపిస్తోందంటున్నారు.

పార్టీ ఆఫీసులో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాధవీలత

ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికల సమయంలో యాక్టివ్ గా ఉన్న మాధవీలత, తిరిగి రాజాసింగ్ ను టార్గెట్ చేసి మళ్లీ తెరపైకి వచ్చారు. మధ్యలో ఒకట్రెండు కార్యక్రమాలకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. పార్టీలో కూడా ఆమెకు పెద్దగా ఏ పదవి లేదు. ఇప్పటి వరకూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లోను కనిపించలేదు. కానీ రాజాసింగ్ రాజీనామాతో ఆయన రాజకీయ అడుగులు సందిగ్ధంలో పడ్డాయి. దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో రాజాసింగ్ ఉంటారో..? లేదో కూడా తెలియని సందిగ్ధం నెలకొంది. దీన్నే మాధవీలత అడ్వాంటేజీగా తీసుకున్నారని.. అందులో భాగంగానే గోషామహల్ అసెంబ్లీ స్థానంపై కన్నేసినట్లు రాజాసింగ్ వర్గీయులు, పార్టీ క్యాడర్ అంటున్నారు.

రాజా ఎపిసోడ్ లో వేలుపెట్టి కొత్త కుంపటి రాజేశారని ఆగ్రహం

కరుడుగట్టిన హిందుత్వవాది అయిన రాజాసింగ్ పై విమర్శలు చేయడంతో రాజాసింగ్ అనుచరులు, గోషామహల్ కార్యకర్తలు మాధవీలతపై గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజాసింగ్ ను ఎదురుకునేంత ధైర్యం మాధవీలతకే కాదు ఎవరికి లేదని తేల్చి చెబుతున్నారు రాజాసింగ్ వర్గీయులు.ఆమె చేసిన విమర్శలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు. రాజసింగ్ ఏపీసోడ్ లో వేలు పెట్టి కొత్త కుంపటికి తెర లేపిన మాధవీలతపై రాష్ట్ర నాయకత్వం డిల్లీ పెద్దలకు ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి రాజసింగ్ పై నోరు పారేసుకున్న మాధవిలతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!