ప్రెస్ మీట్‌లో హరీశ్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
ప్రెస్ మీట్‌లో హరీశ్ రావు, సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ కవిత వారిరువురి మీదా తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
హరీష్‌రావు టార్గెట్‌గా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది. సీఎం రేవంత్, హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ కాళ్లు హరీష్‌రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి.
హరీష్‌రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు.. కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు.. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే.’ అంటూ కవిత ఆరోపించారు.
‘కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా.. ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటారు.. హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు.
నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా? ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా. కేసీఆర్‌ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా? అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నేను ఒకేలా ఉన్నా. అధికారంలో ఉన్నా.. నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది.’ అంటూ కవిత తన ప్రెస్ మీట్ లో ఆద్యంతం హరీశ్ రావుని టార్గెట్ చేశారు..
