కొరివితో గోక్కోవ‌డం అంటే ఇదే.. జ‌న‌సేన ఎమ్మెల్యే వివాదం!

“రంగాను ప్రభుత్వంతోనే చంపించారు.” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కొరివితో త‌ల‌గోక్కోవ‌డం.. లేనిపోని బుర‌ద‌ను తాము అంటించుకుని పార్టీకి కూడా అంటించ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఉన్న కూట‌మి ఎమ్మెల్యేల‌కు అల‌వాటుగా మారిపోయింది. గ‌త ఆరు మాసాల నుంచి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్టుగా వివాదాల‌ను త‌మ చుట్టూ తిప్పుకొంటున్నారు. ఒక‌వైపు.. టీడీపీ ఎమ్మెల్యేలు దారి త‌ప్పుతున్నార‌ని.. సీఎం చంద్ర‌బాబు ల‌బోదిబోమంటున్న‌విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు వ‌చ్చింది. ఆ పార్టీకి చెందిన నాయ‌కుడు ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. లేనిపోని క‌ష్టాలు తెచ్చి పెట్టారు.

జ‌న‌సేన పార్టీ తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యే, ఫ‌స్ట్ టైమ్ గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఆరుగొల‌ను గ్రామంలో కాపు నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న్‌ రంగా కాంస్య విగ్ర‌హాన్ని స్థాపించారు. దీనిని ఆయ‌న ఎమ్మెల్యే హోదాలో వెళ్లి ఆవిష్క‌రించారు. సాధార‌ణంగా ఇలాంటి స‌మ‌యాల్లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో రంగా ప్ర‌తిభ‌ను కొనియాడుతారు. ఆయ‌న సేవ‌ల‌ను కూడా గుర్తు చేసుకుంటారు. కుదిరితే పార్టీకి ప్ర‌యోజ‌న‌కరంగా ఉండే వ్యాఖ్య‌లు కూడా చేస్తారు. కానీ, బొలిశెట్టి పూర్తిగా దారి త‌ప్పారు.

రంగా హ‌త్య సంగ‌తిని బొలిశెట్టి ప్ర‌స్తావించారు. “రంగాను ప్రభుత్వంతోనే చంపించారు.” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. “నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని రంగా నిరాహార దీక్ష చేశారు.(వాస్త‌వానికి కొండ ప్రాంతాల్లో నివ‌శిస్తున్న పేద‌ల ఇళ్ల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని కోరుతూ దీక్ష చేప‌ట్టారు.) అలాంటి సమయంలో కొంత మంది నాయకులు ప్రభుత్వంతో కుమ్మ‌క్క‌యి ఆయన్ని చంపించారు.” అని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. ఇప్పుడు రంగాను త‌మ వాడేన‌ని వారే అంటున్నారని మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఒక్క‌సారిగా ఈ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నంగా మారిపోయింది.

వాస్త‌వానికి 1988లో జ‌రిగిన రంగా హ‌త్య కేసును కోర్టు ఎప్పుడో కొట్టేసింది. ఆయ‌న కుమారుడు రాధా కూడా దీనిపై స‌వాల్ చేయ‌బోమ‌ని చెప్పారు. రాజ‌కీయ క‌క్ష‌ల‌తోనే త‌న తండ్రి చ‌నిపోయార‌ని.. దీనికి ఏపార్టీ కూడా కార‌ణం కాద‌ని.. గ‌తంలోనే రాధా చెప్పుకొచ్చారు. అనంత‌రం.. ఆయ‌న ప‌లు పార్టీలు మారుతూ.. టీడీపీ పంచ‌న చేరారు. కానీ, ఇప్పుడు బొలిశెట్టి మాత్రం .. ఈ విష‌యాన్ని రెచ్చ‌గొట్టేలా చేసిన వ్యాఖ్య‌లు.. దుమారం రేపుతున్నాయి. దీనిపై జ‌న‌సేన వైఖ‌రి చెప్పాలంటూ..కాపునాడు నాయ‌కులు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై జ‌న‌సేన కీల‌క నాయ‌కులు కూడా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. గ‌తంలో బొలిశెట్టి వైసీపీ నాయ‌కురాలు రోజాపైనా అత్యంత దారుణ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!