మూఢనమ్మకాల మంటల్లో మానవత్వం!

సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు నిదర్శనం బాణామతి లేదా చేతబడి. దాని పేరు మీద అన్యాయంగా సాటి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలు… ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ దుర్మార్గాలకు బాధితులవుతున్నారు.

బాణామతికి పాల్పడ్డారనే నెపంతో బిహార్‌లోని టెట్గామా గ్రామంలో ఇటీవల ఒక గిరిజన కుటుంబంలోని అయిదుగురు సభ్యులను చుట్టుపక్కల వ్యక్తులు చావబాది నిప్పంటించి హతమార్చారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలున్నారు. బాణామతి లేదా చేతబడి చేశారనే ఆరోపణలతో ఆదివాసీ, దళిత, వెనకబడిన వర్గాలకు చెందినవారిని, ముఖ్యంగా మహిళలను హతమార్చడం కొన్ని రాష్ట్రాల్లో పరిపాటిగా మారింది.

జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం ఒక్క 2022లోనే దేశవ్యాప్తంగా 85 బాణామతి హత్యలు జరిగాయి. గడిచిన దశాబ్ద కాలంలో 1,184 మంది అలా ప్రాణాలు కోల్పోయారు. బాణామతి పేరుతో ఝార్ఖండ్‌లో ఎక్కువ మంది కడతేరిపోతే, తరవాతి స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశాలు నిలుస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఏకంగా రెండున్నర వేల మంది చేతబడి ఆరోపణలతో హతులయ్యారు.

చట్టాలు ఉన్నప్పటికీ…
బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలతో జరిగే దాడులను నిలువరించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 2021లో ఒక తీర్మానం ఆమోదించింది. 2009-2019 మధ్య అరవై దేశాల్లో మంత్రగాళ్లు, మంత్రగత్తెలంటూ 20వేల మందిపై దాడులు జరిగినట్లు ఐరాస తెలిపింది. బిహార్‌లో 1999లోనే బాణామతి కార్యకలాపాల నిరోధ చట్టం తెచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రభుత్వ అలసత్వానికి పితృస్వామ్య భావజాలం తోడై మంత్రగత్తెలనే సాకుతో బడుగు వర్గాల మహిళలపై దాడులు చేయడం ఆనవాయితీగా మారింది. బిహార్‌లో బాణామతి ఆరోపణలపై హతమైన మహిళల్లో 98శాతం దళిత, బలహీన వర్గాలవారేనని నిరంతర్‌ ట్రస్ట్‌ అధ్యయనం తెలిపింది.

ఈ జాడ్యం గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది. వితంతువులు, భర్త వదిలిపెట్టి వెళ్లినవారు, అవివాహితులుగా ఒంటరి జీవితం సాగిస్తున్న మహిళలకు మంత్రగత్తెలని ముద్రవేసి హింసిస్తున్నారు. లేదా హతమారుస్తున్నారు. వితంతువు పేరిట ఉన్న భూమిని కాజేయడానికి ఆమె బంధువులే బాణామతి ఆరోపణతో కడతేర్చిన ఉదంతాలు కొన్ని ప్రాంతాల్లో వెలుగు చూశాయి. బాణామతి చేస్తున్నారనే నెపంతో పళ్లు ఊడగొట్టడం, ముక్కు కోసేయడం, నగ్నంగా ఊరేగించడం, శిరోముండనం చేయడం, మానవ మలం, పేడ తినిపించడం వంటి హేయ అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఉరితీయడం, నరికేయడం లేదా సజీవ దహనం చేయడం వంటివీ వెలుగు చూస్తున్నాయి.

గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత, మూఢనమ్మకాల వల్ల మానసిక రోగులకు మంత్రగాళ్లని ముద్రవేస్తున్నారు. ముఖ్యంగా అంటువ్యాధులు వ్యాపించినప్పుడు ఎవరో ఏదో చేశారనే అనుమానాలు ప్రబలుతున్నాయి. పితృస్వామ్య భావజాలం, పాత ఆచారాలకు భిన్నంగా స్వతంత్రంగా వ్యవహరించే మహిళలకు మంత్రగత్తెలనే ముద్రవేసి హతమార్చి ఆ తరవాత వారి ఆస్తులను లాగేసుకుంటున్నారు. ప్రస్తుతం బాణామతి పేరిట జరిగే దాడుల నిరోధానికి కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు తెచ్చినా జాతీయ స్థాయిలో అలాంటి ఏర్పాటు లేదు.

పార్లమెంటులో ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగినా అవి ఫలించలేదు. భారతీయ న్యాయ సంహితలోనూ దీనికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు లేవు. మరోవైపు బిహార్, కర్ణాటక, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్రలు ఇలాంటి దాడులను నివారించడానికి చట్టాలు తెచ్చినా వాటిలో స్పష్టత లోపించింది. అస్సాం ఇతర రాష్ట్రాలకన్నా కఠినమైన చట్టాలు చేసింది. అక్కడ ఎవరైనా మహిళను మంత్రగత్తె అని వేధిస్తే యావజ్జీవ కారాగార శిక్ష, అయిదు లక్షల రూపాయల దాకా జరిమానా విధించవచ్చు.

విస్తృత చైతన్యం అవసరం
బాణామతి పేరుతో జరుగుతున్న కర్కశత్వాన్ని నిరోధించడానికి జాతీయ స్థాయిలో వెంటనే పటిష్ఠ చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేయాలి. దాంతోపాటు మూఢనమ్మకాల పట్ల స్థానిక జనసముదాయాల్లో మార్పు తేవడానికి గట్టిగా కృషిచేయాలి. లింగ సమానత్వానికి ప్రాధాన్యమివ్వాలి. ఇందుకోసం సమాచార సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకోవాలి. సమాజంలో చైతన్యం నింపే కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. నాటకాలు, రచనల ద్వారా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనాన్ని జాగృతం చేయాలి. మంత్రగత్తెలని ముద్రపడిన మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో మానసిక చికిత్సాలయాలను పెంచాలి. అప్పుడే అమానవీయ హింసకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!