ముంబై ని ముంచెత్తిన వరద!

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేయగా.. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్త మైంది.మంగళ వారం నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.

ఎడతెరిపిలేని వానల కారణంగా ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో నీరు చేరడం తో ప్రయాణికులు ముందు గానే బయలుదేరాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ సూచించింది.

ఈ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలో జరిగిన మూడు వేర్వేరు విషాద ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. గోద్రెజ్ బాగ్ అపార్ట్‌మెంట్‌లో గోడ కూలి సతీష్ టిర్కే (35) అనే వాచ్‌మన్‌ మృతి చెందాడు.

వాల్మీకి నగర్‌లో ఓ వ్యక్తి డ్రైనేజీలో కొట్టుకుపోగా, అతని కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. మరో విషాద ఘటనలో పాఠశాల నుంచి కుమారుడిని తీసుకుని వస్తున్న యులోజియస్ సెల్వరాజ్ అనే మహిళ, ఆమె ఏడేళ్ల కుమారుడు ఆంటోనీ బెస్ట్ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.

రికార్డు స్థాయి వర్షపాతం ముంబైలో కేవలం 81 గంటల వ్యవధిలోనే 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం కావడం గమనార్హం. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సుల లో ఒకటైన విరార్ సరస్సు నిండి పొంగిపొర్లుతుంది. రత్నగిరి, రాయగడ్, హింగోలి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తు న్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!