ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత
హైదరాబాద్ ఫిలింనగర్ నివాసంలో తుది శ్వాస
దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి
దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు
జయకృష్ణ నివాసానికి చేరుకుంటున్న నందమూరి కుటుంబం
నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
రాజమండ్రి ఎంపీ, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ స్వయానా సోదరి. పద్మజ మరణ వార్త తెలియగానే నందమూరి, దగ్గుబాటి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
పద్మజ మరణవార్త తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయకృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు, పద్మజ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వారు అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు.
మరోవైపు, నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒక్కొక్కరుగా ఫిలింనగర్‌లోని జయకృష్ణ నివాసానికి చేరుకుని పద్మజ భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్నారు. ఆమె మృతితో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది.