ట్రాఫిక్ సమస్యలకు చెక్‌.. హైదరాబాద్‌లోకి జిల్లాల బస్సులు రాకుండా కొత్త బస్ టర్మినల్

హైదరాబాద్ లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకల కోసం కొత్త బస్ టెర్మినల్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, నగర రద్దీ తగ్గి ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే అవకాశముంది.

హైదరాబాద్‌కు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా బస్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బస్సులన్నీ నగర కేంద్రంలోని ఎంజీబీఎస్‌ కు చేరడానికి ట్రాఫిక్ కారణంగా ఆలస్యమవుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కొత్త ఇంటర్‌స్టేట్ బస్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

జాతీయ రహదారి 44 పక్కన ఉన్న ఆరాంఘర్‌ ప్రాంతాన్ని ఈ టెర్మినల్‌ కోసం ఎంపిక చేశారు. ఇక్కడ ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ భవనాలున్నాయి. వాటికి పరిహారంగా రూ. 6 కోట్లు చెల్లించేందుకు ఆర్టీసీ అంగీకరించింది. ఈ భూమిని అధికారికంగా బస్ టెర్మినల్‌ కోసం కేటాయించాలని 2025 జనవరిలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెవెన్యూశాఖకు లేఖ రాశారు. అయినా ఇప్పటివరకు ఈ ప్రతిపాదన రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పెండింగ్‌లోనే ఉంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం రెండు ప్రధాన బస్ టెర్మినల్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి ఎంజీబీఎస్‌. ఇక్కడికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లే బస్సులు వస్తుంటాయి. ఇక మరో టర్మినల్ జేబీఎస్‌. సికింద్రాబాద్‌లో ఉన్న ఈ స్టేషన్ ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు వస్తుంటాయి. ఈ రెండు బస్ స్టేషన్లపై ఒత్తిడి పెరుగుతోంది. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఈ స్టేషన్లకు చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది.

నూతన టెర్మినల్ ఏర్పాటుతో పాటు నగరంలోకి ప్రవేశించే బస్సుల సంఖ్య తగ్గుతుంది. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాదు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రాత్రిపూట నగరంలోకి వచ్చే బస్సులు నేరుగా ఆరాంఘర్‌ టెర్మినల్‌ వద్దే ఆగిపోతే, నగరప్రజలకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇప్పటికే భూ సంబంధిత నివేదికలు సిద్ధమవుతున్నాయి. రంగారెడ్డి కలెక్టరేట్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగానే బస్ టెర్మినల్ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ నగరానికి మరో కీలక బస్సు కేంద్రం లభించనుంది. నగర చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది.

కాగా గతంలో నగరానికి నాలుగు వైపుల ఇలాంటి టర్మినల్స్‌ను నిర్మించే ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ ఆయా మార్గల్లో ఉన్న టర్మినల్స్‌కు మాత్రమే పరిమితమవుతాయి. అక్కడి నుంచి ప్రయాణికులు సిటీ బస్సుల్లో నగరంలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ టర్మినల్స్ ఆరంఘర్‌తోనే ఆగిపోకుండా నగర నలుమూలల విస్తరిస్తుందో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!