ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సరిపోయిన చట్టాలు దేశంలో అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మహారాష్ట్ర ప్రత్యేక పౌర భద్రత బిల్లు పేరుతో తాజాగా మరోచట్టాన్ని ఆమోదించింది. ఈ బిల్లు ప్రకటిత లక్ష్యం పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న నక్సలైట్ అనుయాయులని, అభిమానులని ఏరి వేయటం. దీన్నే చట్టపరమైన భాషలో పట్టణ ప్రాంతాల్లో నక్సలిజం అడుగుజాడలను తుడిచివేయటంగా పేర్కొన్నారు. ఫడ్నవిస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ నక్సలిజం అన్న పదాన్ని చట్టపరిధిలోకి తీసుకురావడానికి గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ వచ్చింది.
2018లో వివాదాస్పదమైన ఎల్గార్ పరిషత్ కేసులో హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసినప్పటి నుంచి సామాజిక కార్యకర్తలను నేరస్తులుగా ముద్ర వేయటానికి ఈ అస్పష్టమైన పదాన్ని వాడుకలోకి తెచ్చారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుతో ఈ పదం చట్టంలో అంతర్భాగంగాను చట్టబద్ధమైన పదంగాను మారానున్నది.
ఈ బిల్లును మహారాష్ట్ర శాసనసభలోను శాసనమండలిలోనూ ఇప్పటికే ఆమోదించారు. త్వరలో గవర్నర్ ఆమోదానికి పంపమన్నారు. గవర్నర్ ఆమోదముద్ర వేస్తే ఇక చట్టంగా అమల్లోకి రానున్నది.
గత వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రతిపాదించినా, సభ నిరవధికంగా వాయిదా పడటంతో చర్చించలేదు. దాంతో గత సంవత్సరం డిసెంబర్‌లో మొదలైన శీతాకాలపు సమావేశాలలో ఈ బిల్లును మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే సర్వత్ర వ్యక్తమైన విమర్శల నేపథ్యంలో బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించారు.
ఈ సంవత్సరం జూలై 9న రాష్ట్ర ముఖ్యమంత్రి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెండు గంటల పాటు సాగిన చర్చల అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ కాలంలో జాయింట్ కలెక్టర్‌కు దాదాపు 12000 సూచనలు, సవరణలు వచ్చాయి. అయితే, తాజాగా అసెంబ్లీలో ప్రతిపాదించిన బిల్లులో కేవలం మూడు సవరణలకు మాత్రమే చోటు దక్కింది. జాయింట్ సెలెక్ట్ కమిటీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు.
ఏ రకమైన ధిక్కారమైనా నేరమే అంటున్న తాజా బిల్లు..
మొదటి సవరణలో బిల్లు పీఠికతో పాటు వివిధ క్లాజుల్లో ఉన్న వ్యక్తిగత అన్న పదాన్ని తొలగించారు. ఈ సవరణను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టిన నోట్‌లో “పట్టణ ప్రాంతంలో నక్సలిజం ఛాయలు లేకుండా రూపుమాపాలన్న ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టబడుతున్న ఈ బిల్లులో గందర గోళానికి అవకాశం లేకుండా చూడాలని వక్కాణించింది. అంతేకాక అతివాద వామపక్ష సంస్థలు, లేదా అటువంటి ఇతర సంఘాలు సంస్థల చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిలువరించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించినట్లు ప్రకటించింది.
బిల్లులోని సెక్షన్ 5లో రెండవ క్లాజు “సలహా మండలిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ ముగ్గురికి హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి కావలసిన అర్హతలు కలిగిన వారై ఉండాలి. ప్రభుత్వం ఏ ముగ్గురు సభ్యులను నియమించినా అందులో ఒకరిని సలహా మండలికి అధ్యక్షుడిగా ప్రకటిస్తుంది” అని ప్రభుత్వం ప్రతిపాదించింది.
దీని స్థానంలో జాయింట్ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించిన సవరణ ప్రకారం, ఈ ముగ్గురు సలహా మండల సభ్యులు అధ్యక్షుడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారైనా లేదంటే పనిచేస్తున్న వారైనా ఉండాలని, మిగిలిన ఇద్దరు సభ్యులు ఒకరు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి మరొకరు హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాది అయి ఉండాలని ప్రతిపాదించింది. ఈ సవరణ ద్వారా ముగ్గురు సభ్యుల్లో కనీసం ఒకరినైనా రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మూడవ సవరణ ముసాయిదా బిల్లులోని సెక్షన్ 15లో రెండవ క్లాజుకు సంబంధించినది. ముసాయిదా బిల్లు ప్రకారం ఈ చట్టం కింద సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్న అధికారి దర్యాప్తు చేయవచ్చు. జాయింట్ సెల్ఫ్ కమిటీ సిఫార్సు తర్వాత సవరించిన క్లాజు ప్రకారం దర్యాప్తు అధికారి స్థాయి డిప్యూటీ సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అయి ఉండాలి.
ఈ చట్టం పరిధిలోకి వచ్చే నేరాలకు విధించే దండనలో భాగంగా రెండు నుంచి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్షగానీ రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు నగదు జరిమానా గానీ శిక్షలుగా ఉంటాయి.
చట్ట విరుద్ధమైనవిగా పరిగణించబడిన సంస్థలు కార్యకలాపాలు నిర్వహించే ఏ ప్రదేశాలనైనా కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించేందుకు ఈ చట్టం జిల్లా న్యాయమూర్తికి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌కు అధికారం ఇస్తుంది. ఈ స్థాయిలో ఉన్న చరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు, న్యాయమూర్తులకు బిల్లు అధికారాలను సంక్రమింపచేస్తుంది. అసెంబ్లీలో జరిగిన చర్చలలో ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోయిన ప్రతిపక్షం ఈ క్లాజు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధికారాలను రెవెన్యూ సిబ్బందికి అప్పగించటానికి బదులు జుడిషియల్ మ్యాజిస్ట్రేట్‌కు అప్పగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. శాసనం ద్వారా స్థాపితమైన వ్యవస్థలు అమల్లో ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన అది నేరమే అవుతుందని ఈ బిల్లు నిర్వచిస్తోంది.
ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పేర్లు ప్రస్తావన లేదు..
ఈ చట్టం అవసరాన్ని సమర్థించుకుంటూ ఫడ్నవీస్ ఇదే తరహా చట్టాలు అమల్లో ఉన్న నాలుగు రాష్ట్రాలు సుమారు 48 ఫ్రంటల్ ఆర్గనైజేషన్సును నిషేధించాయని, మహారాష్ట్రలో కూడా అటువంటి సంస్థలు సంఘాలు 64 ఉన్నాయని ఇవి దేశంలోనే అత్యధికమని అన్నారు. ఈ 64 సంస్థలలో కనీసం నాలుగు సంస్థలను ఇతర రాష్ట్రాలు నిషేధించాయని కానీ, వాటిపై మహారాష్ట్రలో నిషేధం లేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలను సామాజికంగా అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్నామని ఈ సంఘాలు చెప్పుకుంటున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు.
అయితే, ముఖ్యమంత్రి ఈ 64 సంవత్సరాల పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఏ సంస్థలనైనా ఏ సంఘాలనైనా ఈ కోవలోకి తీసుకురావడానికి వీలుగా చూచాయగా ప్రస్తావించారే తప్ప స్పష్టంగా నిర్వచించలేదు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఊపా చట్టం ద్వారా కూడా ప్రభుత్వం కావాలనుకుంటే కొన్ని సంస్థలను చట్టవిరుద్ధమైన సంస్థలుగా గుర్తించి, వాటిని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చడానికి అధికారాలు ఉన్నాయి.
ఇప్పటివరకు ఊపా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 39 సంఘాలను, సంస్థలను నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చి ఈ చట్టంలోని మొదటి షెడ్యూల్ పరిధిలోకి తెచ్చింది. ఆయా సమయ సందర్భాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి గాని వచ్చిన సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు కొత్త సంఘాలను నిషేధిత సంఘాల జాబితాలో చేర్చి ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు, అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఒక సంస్థను ఈ చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటించిన తరువాత ఆ సంస్థకు వ్యతిరేకంగా ఊపా చట్టం కింద ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది, చర్యలు చేపడుతుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఏ సంస్థ ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థకు ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌గా ఉంటుందన్న విషయానికి సంబంధించి స్పష్టత గానీ వివరణ గాని నిర్వచనం గాని క్రోడీకరణగాని ఊపాచట్టంలో లేదు.
ఆయా ప్రకటిత సంస్థలపై నిషేధాన్ని కొనసాగించడానికి గాను హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సదరు నిషేధిత సంస్థల కార్యకలాపాలు వాటి తీవ్రత అవి చట్టపరంగా ఎలా వ్యతిరేకమైనవో అన్న వివరాలు ఆధారాలతో సహా సమర్పించాలి. అయితే మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టపరమైన విధానాన్ని పాటించకుండా కేవలం ఆయా సంస్థలను ఉగ్రవాద సంస్థలు ప్రకటించేసి నిషేధిత జాబితాలో చేర్చి చేతులు దులుపుకుంటున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తాజా బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారుతుంది. ఈ బిల్లు చట్టంగా మారితే రాష్ట్రంలో వివిధ రంగాలు ప్రాంతాలలో పనిచేస్తున్న అనేక పౌరసమాజసంస్థలు ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కోవకు చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆందోళనవ్యక్తం అవుతుంది.
2023లో పోలీసు విభాగాలకు సంబంధించిన సమావేశంలో పాల్గొంటూ మహారాష్ట్రలోని గర్ధిచౌలి ప్రాంత డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ పీ పాటిల్ ఓ పత్రాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రంలో 15 సాంస్కృతిక, హక్కుల సంఘాలు నక్సల్స్‌కు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లుగా వ్యవహరిస్తున్నాయని ప్రస్థావించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ కూడా పాల్గొన్నారు.
కానీ, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో అటువంటి సంఘాలు 64 ఉన్నాయని ఫడ్నవిస్ చెప్తున్నారు. ఏ సంస్థను ఏ కార్యకలాపాల ఆధారంగా నక్సల్స్‌కు ఫ్రంట్ ఆర్గనైజేషన్‌గా ఉన్నదని నిర్ధారించాలనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒక సంస్థను నక్సల్స్ అనుబంధ సంస్థగాను ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌గాను ప్రకటించే ముందు ఆయా సంస్థల విధివిధానాలు కార్యకర్తలకు సంబంధించి పౌర సమాజ స్పందనకు అవకాశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయలేదు.
చట్టాన్ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలు కూడా తమ అసమ్మతిని వ్యక్తం చేయలేకపోయారు.
ఊపా లాంటి కఠినమైన ప్రజావ్యతిరేక చట్టాలు ఉండగానే పడ్నవీస్ ప్రభుత్వం ఈ జాబితాలో మరో చట్టాన్ని చేర్చనున్నది. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాలలో లేని నేరాలు గాని శిక్షలు గాని ఈ తాజా చట్టంలో కనిపించడం లేదు. తాజాగా మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన చట్టంలో ప్రతిపాదించిన నేరాలు శిక్షలు ఇప్పటికే అమల్లో ఉన్న ఊపా, భారతీయ న్యాయ సంహిత, మహారాష్ట్ర సంఘటిత నేరాల నియంత్రణ చట్టంలలో ఉన్నవే తప్ప కొత్తవి కాదు. అటువంటప్పుడు ఈ కొత్త చట్టం అవసరం ఏమిటో?
ప్రభుత్వ విధానాలను నిర్ణయాలను చర్యలను వ్యతిరేకించి ఆందోళనకు దిగే ఏ సామాజిక సమూహాన్ని అయినా నక్సల్స్‌గా ముద్ర వేసి, వేధించేందుకు ఈ చట్టం ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు కట్టబెడుతూ ఉన్నట్టు పౌర సమాజం ప్రతినిధులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ చట్టం పట్టణ ప్రాంతాల్లో ఉండే నక్సలైట్లు అడుగుజాడల గురించి ఆరాలు తీయడం ప్రారంభించనున్నది. విదర్భ ప్రాంతంలో ఉధృతంగా ఉన్న నక్సలైట్ల కార్యకలాపాల గురించి ఈ చట్టం దృష్టి సారించడం లేదు.
ఈ చట్టానికి సంబంధించి ఎన్ని సవాళ్లు ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఇవేవీ చర్చించకుండా శాసన సభ హడావిడిగా ఎందుకు ఆమోదించినట్లు? మహారాష్ట్ర అసెంబ్లీలో ఉన్న 288 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి 235 స్థానాలు ఉన్నాయి. ఈ స్థాయిలో శాసనసభలో సంఖ్యాబలం ఉన్న తర్వాత ప్రభుత్వం ఏ చట్టం కావాలంటే ఆమోదించుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు.
అయితే మహా వికాస్ ఆగాడి కూటమి పేరుతో ఉన్న 58 మంది ప్రతిపక్ష సభ్యులు ఈ చట్టానికి వ్యతిరేకంగా తమ వాణిని సమర్థవంతంగా వినిపించలేకపోయారు. ఏకైక సీపీఎం ఎమ్మెల్యే వినోద్ నికోలే మాత్రమే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి పత్రాన్ని సభలో ప్రవేశపెట్టారు.
శాసనసభలో చట్టం ఆమోదం పొందిన తరువాత శాసనమండలిలో చర్చకు వచ్చినప్పుడు మాత్రం ప్రతిపక్షం సభను బహిష్కరించింది. చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అసమ్మతి పత్రాన్ని సమర్పించింది. జాయింట్ సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా ఉన్న వారిలో నానా పటోలే, విజయ్ వాడెటివార్, సతేజ్ పాటిల్‌లు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాగా ఎన్సీపీకి చెందిన జటింద ఆహ్వాద్, శశికాంత్ షిండేలు, శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి అంబాదాస్ దాన్వే, భాస్కర్ జాదవ్‌లు సభ్యులుగా ఉన్నారు.
తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయంత్ పాటిల్ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన ముఖ్యమైన సిఫార్సును ప్రభుత్వం మౌఖికంగా అంగీకరించిందని చెప్పారు. కానీ, సవరించిన బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు జాయింట్ సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా సవరణలు లేమీ బిల్లులో లేవు. తమ ప్రతిపాదనలకు బిల్లులో చోటు దక్కుతుందన్న ప్రభుత్వ హామీతో శాసనసభలో ప్రతిపక్షం అసమ్మతి తెలపలేదని పాటిల్ అన్నారు.