బాచుపల్లి వద్ద ట్రావెల్ బ్యాగులో మహిళ మృతదేహం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసు వివరాలను బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్‌కుమార్ వెల్లడించారు. తారా బెహరా (33), విజయ్ తోఫా (30) నేపాల్‌కు చెందినవారు.
అక్కడ ఉండగానే వీరిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే తారాకు ఇద్దరు పిల్లలున్నారు. సహజీవనం చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో నేపాల్ నుంచి హైదరాబాద్ వచ్చి కాపురం పెట్టారు. కొన్ని రోజుల క్రితం తారా గర్భం దాల్చింది. తనకు ఇద్దరు పిల్లలున్నారని.. అబార్షన్ చేయించుకుంటానని విజయ్‌తో ఆమె చెప్పింది. అందుకు అతడు అంగీకరించలేదు.
పిల్లల్ని కని నేపాల్‌కు తీసుకెళ్దామని చెప్పాడు. అందుకు తారా నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తన డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో ఆమెను హతమార్చాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఉరి బిగించి తారాను చంపాడు.
కూకట్‌పల్లిలో ట్రావెల్ బ్యాగుని కొనుగోలు చేసి మృతదేహాన్ని అందులో పెట్టి బాచుపల్లి ప్రాంతంలో పడేశాడు. నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు