తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా రు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి
తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. కానీ, పదో తరగతి ఫలితాలు వెల్లడి ఆలస్యం కావటంతో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా.. ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది.
తెలంగాణలో ఈనెల 30వ తేదీన పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అధికారులు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసే అవకాశం ఉంది.
వాస్తవానికి వారం రోజుల క్రితమే టెన్త్ మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాలుగా సమాధాన పత్రాలు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే, విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆధీనంలోనే ఉంది. ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు.
ఈ విషయంపై ఇటీవల రేవంత్ రెడ్డిని విద్యాశాఖ ఉన్నతాధికారులు కలిసి ఫలితాల విడుదల విషయంపై చర్చించారు. ఈ క్రమంలో ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్లు తెలిసింది.
దీంతో ఈ మేరకు ఫలితాల విడుదలపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.