తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి… పార్టీకి ఎంతో బలమన్న వాదనలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయి…వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటి ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకూ బలపడుతున్నాయి. పొంగులేటి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాట వినిపించినా ఆశ్చర్యం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
మొన్నటికి మొన్న సీఎం రేవంత్, పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో సంబంధం లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చేసిన ప్రకటన కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసింది. తాజాగా పొంగులేటి చేసిన మరో వ్యాఖ్య… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపైనే పెను ప్రభావం చూపనుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా ఈ సారి పొంగులేటి ఏమన్నారంటే… ఎన్నికలకు మిగిలిన మూడున్నరేళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే… ఓట్లు అడిగేందుకు వస్తామని ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ శ్రేణులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసిందని చెప్పక తప్పదు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీలో పాలుపంచుకున్న పొంగులేటి… అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రస్తావించారు. బీఆర్ఎస్ సర్కారు పదేళ్ల పాలనలో అనుకున్న ఒక్క లక్ష్యాన్ని చేరలేకపోయిందని ఆయన ఆరోపించారు. అయితే తాము మాత్రం హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన తర్వాతే ఓట్లు అడిగేందుకు వస్తామని ఆయన తెలిపారు. ఈ లక్ష్యాన్ని మిగిలిన ముడున్నరేళ్లలోనే పూర్తి చేస్తామని పొంగులేటి చెప్పడం గమనార్హం.
అయినా పొంగులేటి హామీ అమలు సాధ్యమేనా? అన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వాటి పంపిణీ సుదీర్ఘ కసరత్తుతో కూడుకున్నది. అంతేకాకుండా నిధుల లభ్యత కూడా ఇప్పుడు తెలంగాణ సర్కారును వేధిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మూడున్నరేళ్లలో 20 లక్షల ఇళ్ల పంపిణీ అనేది దుస్సాధ్యమేనని చెప్పాలి. ఇలాగే చాలా మంది నేతలు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ ఉదంతాలు చాలానే ఉన్నాయి. మరి ఇవన్నీ తెలియకనే పొంగులేటి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పొంగులేటి తన వ్యాఖ్యలతో సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ ను కూడి ఇరుకున పడేస్తున్నారని చెప్పక తప్పదు.