కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం.. కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా అడ్వకేట్ రామచందర్‌రావుతో కలిసి లోపలికి అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజీద్ ఖాన్‌తో కూడిన ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ ఈనెల 13వ తేదీన రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నేడు విచారణకు హాజరయ్యారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఎఫ్ఈవో కంపెనీకి చెందిన ప్రతినిధులతోపాటు ఈ కేసులో మరికొంతమంది ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ భవన్‌కు తాళం..!!

కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయంవైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. అలాగే తెలంగాణ భవన్‌ గేటుకు పోలీసులు తాళం వేశారు. మరోవైపు ఇవాళ సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రానున్న నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ శ్రేణులు దూసుకురాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్‌ను క్లోజ్ చేయించారు.

వందసార్లైనా జైలుకు వెళ్తా : కేటీఆర్

ఇవాళ ఉదయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తనకు చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. ఇప్పటికే మూడుసార్లు పిలిచారని, 30 సార్లు పిలిచినా విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు కూడా చేయవచ్చని, అయితే తెలంగాణ కోసం గతంలోనే జైలుకు వెళ్లి వచ్చానని వ్యాఖ్యానించారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. ఒక్కసారి కాదు వందసార్లయినా జైలుకు వెళ్తానని, కానీ కేసీఆర్ లక్షల సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు. ఫార్ములా -ఈ కార్ రేసులో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపైన కూడా ఏసీబీ కేసులు ఉన్నాయని, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అని కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.

ఇంటికా..? జైలుకా..?

అయితే విచారణకు తర్వాత కేటీఆర్ ఇంటికి వస్తారా లేక అరెస్టై జైలుకు వెళ్తారా..? అనేది ఉత్కంఠగా మారింది. ఫార్ములా-ఈ రేస్ కోసం ఒప్పందాలు, నిధుల విడుద కోసం కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం, ఈసీ అనుమతి వంటి వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ కో తప్పుకోవడం, ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్ల ద్వారా బీఆర్ఎస్‌కు వచ్చిన నిధులు వంటి కీలక అంశాలపై సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగితే, ఆ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

లాయర్లతో హరీశ్‌రావు చర్చలు..!!

కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో మరోవైపు తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు న్యాయవాదులతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు కాబోతున్నారా..? అనేది పార్టీ వర్గాలను మరింత టెన్షన్ పెట్టిస్తోంది..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!