స్థానిక ఎన్నికలపై సర్కార్ వర్కౌట్..! ఆ తేదీలోగా పూర్తి చేయాలని టార్గెట్..!!

village-elections-telangana

ఆగస్టు 15లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది.

ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూలు తయారు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో టాక్. షెడ్యూలు విడుదల చేసేలోపు పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నట్లు తెలిసింది.

జూన్ చివరి లేదా జూలై తొలివారంలో షెడ్యూలు..

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్‌తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది? ఆ తర్వాత ఎన్ని రోజులకు ఎన్నికల షెడ్యూలు విడుదల చేయొచ్చు? ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య ఎన్ని రోజుల సమయం కావాలి? అనే అంశాలపై చర్చ జరుగుతున్నది. ముందుగా బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసుల మేరకు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు రిజర్వేషన్లను ఖరారు చేసి గెజిట్ విడుదల చేయాలి. ఈ ప్రక్రియను జూన్ మూడో వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరన లేదా జూలై ఫస్ట్ వీక్‌లో ఎన్నికలు షెడ్యూలు ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సైతం రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది.

ఒక్కో ఎన్నికకు వారం రోజుల గ్యాప్

ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఈ ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఓ వైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అటు ఇటుగా పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు షెడ్యూలు తయారు చేస్తున్నట్టు టాక్. ఆ ఫలితాలు ప్రకటించిన వారం, 10 రోజుల తేడాతో 139 మున్సిపల్, 17 మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసి, అగస్టు 15లోపు కొత్త పాలక వర్గాలతో జెండా వందనం చేయించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది.

షెడ్యూలు లోపు రైతు భరోసా పూర్తి..

స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేలోపు రైతు భరోసా కింద పంట సాయం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. యాసంగి సీజన్ రైతుభరోసా కింద కేవలం 4 ఎకరాలలోపు రైతులకు మాత్రమే చెల్లించారు. మిగతా రైతులు తమ అకౌంట్‌లో డబ్బులు ఎప్పుడు పడుతాయోనని ఎదురుచూస్తున్నారు. దీనితో రైతు భరోసాను పూర్తిగా చెల్లించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అలాగే.. ఈలోపు గ్రామ, పట్ణణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు క్యాలెండర్ రెడీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!